ఇది మా ఉరి పక్క భోజనాల్లో వడ్డిస్తారు. పండగలు, శుభకార్యాలు - ఈ సందర్భాల్లో వడ్డనలో ఉప్పు తర్వాత ఇదే వడ్డిస్తారు. తప్పనిసరిగా చేస్తారు.
ఇప్పుడు స్ప్రౌట్స్ తినాలి , పచ్చికూరలు తినాలి - మంచిదని కనిపెట్టారు అంటారు కానీ మా పక్క భోజనాల్లో అదీ విందు భోజనాల్లో ఇది మంచిదని గుర్తించటం వల్లేనేమో పూర్వం నుంచీ సంప్రదాయంగా వస్తోంది.
ముందుగా ఇది కొద్దిగా నైనా సరే తీసుకుని తర్వాతే భోజనం చేస్తారు. అందుకే అన్నీ వడ్డించే ఆకులోనే వేస్తారు.
కావలసిన పదార్థాలు:-
పెసరపప్పు - ఒక పిడికెడు (ముగ్గురికి ) నచ్చితే ఇంకో సారి ఎక్కువ చేసుకోవచ్చు.
పచ్చిమిర్చి - చిన్నదొకటి (అతి చిన్న ముక్కలుగా తరగాల)
దోసకాయ - ఒక కప్పు (తురిమినది ) (పసుపు రంగుదోసకాయ కాదు)
పచ్చికొబ్బరి - ఒక కప్పు (తురిమినది)
తిరగవాత కు కావలసిన ఆవాలు (నాలుగు గింజలు) , ఇంగువ (చిటికెడు) , కరివేప ఆకు (చిన్నముక్కలు) , ఒక చిన్న ఎండుమిరపకాయ, చిన్ని చెంచా నూనె.
ఉప్పు - తగినంత (ఎక్కువ పట్టదు, ఒక చిటికెడు, లేదా రెండు అంతే)
చేసే పద్ధతి :-
- ఒక అరగంట ముందుగా పెసరబేడలు కడిగి, మునిగేలా నానబోయాల.
- అంతకన్నా ఎక్కువ నానితే పైన నురుగు తేలటం , ఇంకాసేపుంటే వాసన రావటం జరుగుతుంది.
- నానిన పెసరబేడలను వడబోయాల.
- చుక్క నీరు కూడా మిగలకుండా పొడిపొడిగా ఉండాల. (ఎండలో బెట్టబోకండి)
- ఇప్పుడు తురిమిన పచ్చికొబ్బెర, తురిమిన దోసకాయ , ఉప్పు వేసి బాగా కలపాల.
- ఇప్పుడు శానా కొంచెం నూనె వేసి ఆవాలు, కరివేప ఆకు, ఎండుమిరపకాయ, పచ్చిమిరప కాయముక్కలు ఇంగువ వేసి చిటపటలాడిన వెంటనే బేడల మిశ్రమంలో కలిపేయాల. తిరగ వాత అస్సలు మాడకూడదండీ!
ఇప్పుడు కొన్ని గమనికలు:-
- ఇది అప్పటికప్పుడు చేసుకోవాల్సినది. (పచ్చికొబ్బెర కదా అలా ఉంచేస్తే వాసన వచ్చేస్తుంది. దోసకాయ తురిమినది నీరు కారిపోతుంది. )
- చేసుకున్న వెంటనే అందరికీ తినడానికి ఇస్తే ఘుమఘుమ లాడుతూ చాలా బాగుంటుంది.
- పొరపాటుగ ఎక్కువ చేసి మిగిలిపోతే మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి తిప్పేయండి. చెట్నీ అవుతుంది.
- కొత్తిమీర చిన్న ముక్కలు, కారట్ తురిమినది వేస్తే రంగులతో హంగుగా ఉంటుంది. (ఓపిక ఉంటే)
- మా పక్క గౌరీ పూజలప్పుడు దేవికి పెసరబేడలు నానబెట్టినవి నైవేద్యాల్లో తప్పనిసరి. ఇంకా శ్రీరామనవమి కి కూడా పానకంతో పాటు పెసర బేడలు నానబెడతారు కదా! నైవేద్యం అవగానే వడబోసి సాయంకాలానికి చేసుకుంటే పేరంటానికి వచ్చినవాళ్ళకి ఇస్తూ ఉంటాము. కొందరు దోసకాయ ముక్కలు గా వేస్తారు. కానీ అప్పుడు బాగా కలవకుండా విడిగా ఉంటుంది.
- పచ్చిమిరపముక్కలు నోటికి తగలకుండా ఉండాలంటే దంచి వేయవచ్చు.
అన్నిటికన్నా ముఖ్యం - ఉప్పు, కారం తక్కువ పడుతుంది. చూసి వేసుకోవాలి.
చాలా సులభం , తప్పక చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి