మా సీమలో దోసకాయ అంటారు కానీ కొందరు కీర దోసకాయ అంటారనుకుంటా. అంటే చూడటానికి ఆకుపచ్చని గీతలో లేతాకుపచ్చ రంగులో బీరకాయకు తోబుట్టువు లాగా ఉంటుందే. ఆ దోసకాయన్నమాట.
దోసకాయ పెరుగు పచ్చడి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లాగ్ టెంప్లేట్ మాదిరి తెలుపుమీద ఆకుపచ్చ డిజైన్.
కాయ లో సహజ సిద్ధంగా ఉన్న నీరు వల్ల ఎండాకాలంలో ఎంతో మంచిది. పచ్చికాయ ముక్కలు గా కోసుకుని తింటే చాలా బాగుంటుంది. కొందరు ఉప్పు, కారం కూడా అద్దుకొని తింటారు కానీ నాకయితే ఉత్తదే ఇష్టము.ఇంతకీ పెరుగు పచ్చడి ఎట్ల తయారు చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:_
దోసకాయ = లేతగా ఉంటే బాగుంటుంది. కొంచెం ముదిరినా కూడా ఫర్వాలేదు. చక్కగా కడిగి తురిమి పెట్టుకోవాలి.
పచ్చిమిరపకాయలు = కారం తినేవాళ్ళను బట్టి, కాయల కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి. పెసరబేడలంత చిన్నగా తరిగితే కారం తెలీదు.
ఉప్పు = తగినంత
కరివేపాకు, కొత్తిమీర = సువాసనకు.
ఒక చిటికెడు పసుపు.
తిరగవాతకు ఒక చెంచా నెయ్యి, ఆవాలు, మినపబేడలు, ఎండుమిరపకాయలు, ఇంగువ.
చేసే పద్ధతి:_
పెరుగు ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అందులో తురిమిన దోసకాయ (పచ్చిదే) వేసి, తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, పచ్చి కరివేపాకు, కొత్తిమీర తరిగి వేసుకోవాలి.
ఇప్పుడు నెయ్యి తో తిరగవాత పెట్టి పెరుగు పచ్చడిలో కలపాలి.
నెయ్యి, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతున్న పచ్చడి తయారు.
గమనికలు:_
నెయ్యి తప్పనిసరి.
భోజనంలో ఒక అదనపు ఆధరువు గా, పలావ్, ఫ్రైడ్రైస్ లాంటి వాటికి కూడా పనికి వస్తుంది. చపాతీకి కూడా బాగుంటుంది.
వడ్డించడానికి కొంచెం ముందుగా చేసుకోవాలి. బాగా ముందే చేస్తే తాజాగా ఉండదు.