Loading...

శుక్రవారం 6 జనవరి 2012

కొబ్బెర చిన్ని

పచ్చి కొబ్బెర తో చేసే ఈ తీపు చాలా బాగుంటుంది.
కావలసిన పదార్థాలు.

పచ్చి కొబ్బెర ఒక చిప్ప తురిమి ఉంచుకోవాల.

చక్కెర తురిమిన కొబ్బెర కన్నా ఎక్కువ తీసుకొవాల.
అంటే ఒక  గిన్నెడు   తురిమిన కొబ్బెరకు ఒకటిన్నర గిన్నెడు చక్కెర అన్నమాట.

శనగపిండి రెండు చెంచాలు.

నెయ్యి రెండు చెంచాలు.
అంతే.

చేసే పధ్ధతి.
మందపాటి బాణలి లేదా గిన్నె తీసుకొవాల.

ముందుగా చక్కెర తడిసేటట్టు నీరు కొంచెం పోసి తడిపొడిగా కలపాల.

సన్నటి సెగ మీద పెట్టి చక్కెర కరగనిచ్చి, మధ్యలో కల్పుతూ ఉండాల.

చక్కెర కరుగుతూనే ఆలస్యం లేకుండా కొబ్బెర వేసేయాల.

కొబ్బెర వేసేటప్పుడు కల్పుతూ మెల్లగా   వెయ్యాల. . ఒక్కరే మానేజ్ చేయలేకపోతే పక్కవాళ్ళ సహాయం తీసుకుంటే
మంచిది.

ఇప్పుడు గరిట విడచకుండా కల్పుతూ ఉండాల.

మధ్యలో నెయ్యి వెయ్యాల.

సన్నటి సెగ మీద పచ్చి కొబ్బెరను బాగా ఉడకనిస్తే రుచి బాగుంటుంది. తొందర పడితే అంతే.

కొబ్బెర ఉడికి మనం వేసిన దానికంటే బాగా తగ్గుతుంది.

అప్పుడు కొంచెం శనగపిండి చల్లాల. ఒకే చోట పడకుండా చూసుకోండి. ఒకరు కలుపుతుంటే ఇంకొకరు వేస్తె మేలు.

తర్వాత నెయ్యి పూసి సిద్ధంగా ఉన్న తట్టలో కి వంపేసి సమంగా కావటానికి గరిటతో సర్దవచ్చు. లేదా తట్టను మెల్లగా తట్టవచ్చు.
తట్ట అంటె కంచం.
ఒక అరగంట లో ముక్కలు కోసుకోవచ్చు.
చాలా చాలా బాగుంటుంది.

గమనిక - శనగపిండి ఉండలు లేకుండా జల్లెడ పట్టి పెట్టుకోవాల.
చక్కెర లో నీళ్ళు ఎక్కువ కాకుండా చూసుకోవాల.

మంగళవారం 6 డిసెంబర్ 2011

చిగురు+నువ్వుల పొడి




అన్నంలో కలుపుకుని గాని, దోసెల్లోకి గాని , చపాతీల్లోకి గాని అన్నిటికీ బాగుండేది, తిరుగులేనిది, ఉత్తది కూడా నోట్లో వేసుకుంటే ఆహా అనిపించేది, ఇలా తలుచుకుంటేనే నోరూరించేది............అబ్బబ్బా ఇంకెంత సేపు ఈ సుత్తి అనుకుంటున్నారా?

కావలసిన పదార్థాలు
చిగురు _____ ఒక పిడికెడు
నువ్వులు/నూగులు ____ ఒక ౧/౨పావు(లేదా)౧/౨చిట్టి (ఇది పేరు కాదండోయ్ , మా వైపు ఒక కొలత సుమారు ౧౦౦ గ్రాములు ఉంటుంది.
కారప్పొడి ____ మీరెలా కారం తింటారో అలాగ. ( రెండు చెంచాలు మధ్యరకం. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.
ఉప్పు _____ రెండు చెంచాలు    
 చేసే విధానం
ముందు నువ్వులు కొంచెం వెచ్చ చేసుకోవాలి.
చింత చిగురు పుల్లలు లేకుండా ఏరి చేతితో నలిపి ఉంచుకోవాలి.
ఇంకేముందీ ఏముందీ అన్నీ కలిపి పొడి గొట్టడమే.

గమనికలు

నెయ్యి లేదా నూనె చేర్చుకోండి తినేప్పుడు.
చిగురు లేకపోతే ఉత్త నూగుల పొడి కూడా బాగుంటుంది.

మంగళవారం 8 నవంబర్ 2011

చైనా సేమ్యాలు



                                                                          మరంతే గదండీ, వాళ్ళు నూడుల్స్ అంటారు. మనం సేమ్యాలు అంటాం. చూట్టానికి అలాగే ఉంటాయికదా!  మా నాన్నమ్మ కు మేనత్త, మా తాతయ్యకు పిన్ని ఒకావిడ ఉండేది. పేరు లక్ష్మీ దేవి కానీ పేరు పెట్టి ఎవరైనాఆవిడను పిలువగా మేమెప్పుడు చూశాం గనుక? అవ్వ అనే వాళ్ళం. మాకు ఊహ తెలిసేసరికే ఆవిడకు ఎనభైకి పైగా వయసు. డిటెక్టివ్ నవలలు (వాటిలో అక్షరాలు చిన్నచిన్నగా ప్రింట్ చేసేవాళ్ళెందుకో మరి) చదివేది, ఆ వయసులో. అదీ గట్టిగా చదువుతుండేది. సినిమాలకు వచ్చేది. (తొంభైయేళ్ళప్పుడు కూడా. )  ఎందుకు చెపుతున్నానంటే ఆవిడ మొదట్లో సేమ్యాలుతయారు చేసేదట. మా ఊరికి వస్తే మాకూతయారు చేసి పెట్టేదట. ఎందుకు శ్రమ అన్నా వినేది కాదట. కొన్నవాటి కన్నా శ్రేష్ఠంగా ఉంటాయికదూ. హైజెనిక్ గా. ఆవిడ మాట ఎవ్వరూ కాదనలేరుట. మా తాతయ్యకు, నాన్నమ్మకు చిన్నతనం లోనే తల్లిదండ్రులు పోతే ఇద్దర్నీ పెంచి పెద్దచేసి పెళ్ళి చేసిందట. సరే అసలు విషయానికొస్తే మేము  నూడుల్స్ తినను గాక తినను. మన సేమ్యా అయితే తినేస్తాను. కానీ కొడుకు కోసం చేస్తాను.
                                       
                             నేను చేసే నూడుల్స్ అదే చైనా సేమ్యా మా అబ్బాయికి చాలా ఇష్టం. బయట  అస్సలు నచ్చదు.

నేనెలా చేస్తాను? అందులో కూరలన్నీ వేస్తాను. తర్వాత్తర్వాత కంపెనీ వాళ్ళే వెజ్ నూడుల్స్ అంటూ ప్రవేశపెట్టారు. ప్చ్....అనవసరంగా పేటెంట్ చేయించుకోకుండా వదిలేశాను.

 కావలసిన పదార్థాలు:-

ముఖ్యమైనది మొదటే చెప్పానుగా,

ఉర్లగడ్డ ముక్కలు  (కావలసినన్ని)

ఉల్లిగడ్డ ముక్కలు  (కావలసినన్ని) 

పచ్చిమిరపకాయ ముక్కలు ( ఒక పాకెట్ కు ఒక కాయ)
టమేటో ముక్కలు (కావలసినన్ని)

బీన్స్ ముక్కలు (కావలసినన్ని)

కారట్ ముక్కలు (కావలసినన్ని)

పచ్చి బఠానీ (లేదా ఎండు బఠాణి ఒక పూట నానబెట్టినవి)

ఉప్పు (కూరముక్కలకు తగినంత)

నూనె రెండు చెంచాలు

నీళ్ళు రెండు లోటాలు    

తయారు చేయు పద్ధతి :-
ముందుగా పొయ్యి వెలిగించి బాణలి పెట్టుకుని నూనె వేయాలి. కాగిందనటానికి గుర్తుగా ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.

కూరముక్కలు అన్నీ వేసి ఉడకనివ్వాలి
ఉప్పు వేసి చైనా సేమ్యా వేయాలి.(పాకెట్ లో ఉన్నమసాలా పొడితో బాటు)

మూతపెట్టి మంట తగ్గించాలి

నీళ్ళు పూర్తిగా ఇగిరిపోవాలా, కొద్దిగా మిగలాలా అనేది తినేవాళ్ళ ఇష్టం.
తినాలా లేదా అనేది మీ ఇష్టం. నేను మాత్రం తినమని చెప్పను. :-))

శనివారం 22 అక్టోబర్ 2011

పెసరబేడల సలాడ్



                              ఇది మా ఉరి పక్క భోజనాల్లో వడ్డిస్తారు. పండగలు, శుభకార్యాలు - ఈ సందర్భాల్లో వడ్డనలో ఉప్పు తర్వాత ఇదే వడ్డిస్తారు. తప్పనిసరిగా చేస్తారు.
               
                                               ఇప్పుడు స్ప్రౌట్స్ తినాలి , పచ్చికూరలు తినాలి - మంచిదని కనిపెట్టారు అంటారు కానీ మా పక్క భోజనాల్లో అదీ విందు భోజనాల్లో ఇది మంచిదని గుర్తించటం వల్లేనేమో పూర్వం నుంచీ సంప్రదాయంగా వస్తోంది.
                                                       
                                              ముందుగా ఇది కొద్దిగా నైనా సరే తీసుకుని తర్వాతే భోజనం చేస్తారు. అందుకే అన్నీ వడ్డించే ఆకులోనే వేస్తారు.

 కావలసిన పదార్థాలు:-
పెసరపప్పు            - ఒక పిడికెడు (ముగ్గురికి ) నచ్చితే ఇంకో సారి ఎక్కువ చేసుకోవచ్చు.
పచ్చిమిర్చి           - చిన్నదొకటి (అతి చిన్న ముక్కలుగా తరగాల)
దోసకాయ            - ఒక కప్పు (తురిమినది ) (పసుపు రంగుదోసకాయ కాదు)
పచ్చికొబ్బరి        - ఒక కప్పు (తురిమినది)
తిరగవాత కు కావలసిన ఆవాలు (నాలుగు గింజలు) , ఇంగువ (చిటికెడు) , కరివేప ఆకు (చిన్నముక్కలు) , ఒక చిన్న ఎండుమిరపకాయ, చిన్ని చెంచా నూనె.
ఉప్పు                     - తగినంత (ఎక్కువ పట్టదు, ఒక చిటికెడు, లేదా రెండు అంతే)

చేసే పద్ధతి :-

  • ఒక అరగంట ముందుగా పెసరబేడలు కడిగి, మునిగేలా నానబోయాల.
  • అంతకన్నా ఎక్కువ నానితే పైన నురుగు తేలటం , ఇంకాసేపుంటే వాసన రావటం జరుగుతుంది.
  • నానిన పెసరబేడలను వడబోయాల.
  • చుక్క నీరు కూడా మిగలకుండా పొడిపొడిగా ఉండాల. (ఎండలో బెట్టబోకండి)
  • ఇప్పుడు తురిమిన పచ్చికొబ్బెర, తురిమిన దోసకాయ , ఉప్పు వేసి బాగా కలపాల.
  • ఇప్పుడు శానా కొంచెం నూనె వేసి ఆవాలు, కరివేప ఆకు, ఎండుమిరపకాయ, పచ్చిమిరప కాయముక్కలు ఇంగువ వేసి చిటపటలాడిన వెంటనే బేడల మిశ్రమంలో కలిపేయాల. తిరగ వాత అస్సలు మాడకూడదండీ! 


ఇప్పుడు కొన్ని గమనికలు:-

  1. ఇది అప్పటికప్పుడు చేసుకోవాల్సినది. (పచ్చికొబ్బెర కదా అలా ఉంచేస్తే వాసన వచ్చేస్తుంది. దోసకాయ తురిమినది నీరు కారిపోతుంది. )
  2. చేసుకున్న వెంటనే అందరికీ తినడానికి ఇస్తే ఘుమఘుమ లాడుతూ చాలా బాగుంటుంది.
  3. పొరపాటుగ ఎక్కువ చేసి మిగిలిపోతే మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి తిప్పేయండి. చెట్నీ అవుతుంది. 
  4. కొత్తిమీర చిన్న ముక్కలు, కారట్ తురిమినది వేస్తే రంగులతో హంగుగా ఉంటుంది. (ఓపిక ఉంటే)
  5. మా పక్క గౌరీ పూజలప్పుడు దేవికి పెసరబేడలు నానబెట్టినవి నైవేద్యాల్లో తప్పనిసరి. ఇంకా శ్రీరామనవమి కి కూడా పానకంతో పాటు పెసర బేడలు నానబెడతారు కదా! నైవేద్యం అవగానే వడబోసి సాయంకాలానికి చేసుకుంటే పేరంటానికి వచ్చినవాళ్ళకి ఇస్తూ ఉంటాము.  కొందరు దోసకాయ ముక్కలు గా వేస్తారు. కానీ అప్పుడు బాగా కలవకుండా విడిగా ఉంటుంది.
  6. పచ్చిమిరపముక్కలు నోటికి తగలకుండా ఉండాలంటే దంచి వేయవచ్చు.

అన్నిటికన్నా ముఖ్యం - ఉప్పు, కారం తక్కువ పడుతుంది. చూసి వేసుకోవాలి.
చాలా సులభం , తప్పక చేయండి.

ప్రముఖ పోస్ట్‌లు