Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

గోంగూర పుల్లఁగూర

ఈ పేరు చూసి ఏమబ్బా ఇలా ఉంది అనుకుంటున్నారేమో. మా అవ్వ (నాన్నమ్మ) ఇలాగే అనేది. మా వూళ్ళో ఈ కూరకి ఇదే పేరు. మాండలీకాల్లో ఉన్న సొగసే వేరు. ఆ కోస్తా జిల్లాల భాష అందం గా రేడియో లో వినిపిస్తుంటే అప్పట్లో పడిపోయానుఁగానీ ఇప్పుడు ఆ వ్యామోహం లేదు. కాకపోతే కొన్నేళ్ళు కోస్తాలో ఉండి అలవాటయిపొయింది.
సరే , ఈ ప్రాంతీయభావాల గొడవలు నాకిష్టం లేదు. తెలుగంతా నాదే. అన్ని యాసలూ నాకిష్టమే.
ఇక విషయానికొస్తే గోంగూర తో పుల్లఁగూర, కోయఁగూరతో తియ్యఁగూర అంటూ మా అవ్వ చేసేది. ఇప్పుడు నేను పాలకూర, చుక్కకూరతో కూడా చేస్తున్నాను. అన్నిటికీ ఒకే పద్ధతి. తేడా ఏమిటంటే గోంగూర, చుక్కకూర పుల్లగా ఉంటాయి. వాటి పులుపు తగ్గించాలంటే కొన్ని చర్యలు తీసుకోవచ్చు. చెప్తాను. పాలకూర , కోయఁగూర కమ్మగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు.
  1. గోంగూర - ఆకులు మాత్రం తీసి చక్కగా కడిగి , తరిగి పెట్టుకోవాలి.
2 ఉల్లిగడ్డలు - ఆకులు చిన్నగిన్నెడు ఉంటే రెండు పెద్ద ఉల్లి గడ్డలు కావాలి.
3పచ్చిమిర్చి - తగినంత
4 తిరగవాతకు కావలసిన ఆవాలు, మినపబేడలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ , నూనె.
5ఎల్లిపాయలు - ఇష్టం ఉంటే తిరగవాత లో వేసుకోవచ్చు.
6పప్పులు, ఎండుకొబ్బెర కలిపి మిక్సీలో వేసిన పొడి (పప్పులు = వేయించిన శనగపప్పు)
7కొద్దిగా పాల మీగడ
8ఉప్పు - తగినంత , ఒక చిటికెడు చక్కెర.
తయారు చేసే విధానం
ముందుగా పొయ్యి వెలిగించి బాణలి పెట్టాలి.
నూనె కొంచెం ఎక్కువే పోసి (అంటే మామూలు కూరలకన్నా కొంచెం ఎక్కువ) తిరగవాత పెట్టి , అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయాలి.
అవి కొంచెం వేగిన తర్వాత గోంగూర వేసి కలిపి మూత పెట్టాలి.
ఒక 5 నిముషాల్లోనే గోంగూర మెత్తబడి ఉంటుంది .
మూత తీసి అందులో కొంచెం మీగడ వేసి , కలిసిపోయాక, ఉప్పు వేసి దించాలి.
పైన చెప్పిన పొడి వేసి బాగా కలిపి ఉంచాలి. ఇప్పుడు కూర తయారు.

ఇంక కొన్ని గమనికలు.
గోంగూరకు, కోయఁగూర (తోటకూర)కూ, పాలకూరకూ , చుక్కకూరకూ ఇదే పద్ధతి.
గోంగూర, చుక్కకూర పులుపు కాబట్టి మీగడతో పాటు కాసిని పాలు పోసి వండితే పులుపు తగ్గించుకోవచ్చు.
కోయఁగూర, పాలకూర కమ్మగా ఉంటాయి కొంచెం మారుద్దామంటే ఒక గరిటె పెరుగు వేస్తే సరి. వద్దంటే మానేయవచ్చు.
అన్నంలోకీ, చపాతీలోకీ కూడా బాగుంటాయి ఈ కూరలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు