శ్రావణమాసం వచ్చిందిగదా! శ్రావణ మాసం శుద్ధ చవితి నాడు మేము నాగదేవ పూజ చేస్తాం.
ఇదే పూజని కొందరు కార్తీక మాసంలో చేస్తారు.
నాగుల చవితి నాగన్నా, పూజలు గొనుమన్నా అని పాట కూడా ఉన్నట్టుంది కదూ.
నాగుల చవితి నైవేద్యానికి నూల ఉంటలు , చలిమిడి చేస్తాం.
నాగులకి నూగులు -- బాగుంది కదూ.
నువ్వులు --నూగులు---పలికేటపుడు నూలు అయిపోతుంది. మహాలక్ష్మి- మాలక్ష్మి అయినట్టు, నాగరాజు నారాజు అయినట్టు....తిరపతి - తిరప్తి అయినట్టు..
అసలయితే పచ్చి నూగులతోనే నైవేద్యం ఉంట లు (లడ్డూలు) చేయాలి. తినడానికి నూగుల్ని కొద్దిగా వట్టినే వేయించి చేసుకుంటారు. కానైతే నాకు పచ్చి నూగుల ఉంటలే చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు :-
నల్ల నూగులు (ఖచ్చితంగా నల్లవే) ----ఎన్ని కావాలో అన్ని - పోనీ ఓ నూరు గ్రాములు తీసుకోండి
ఎండుకొబ్బెర - కొలతల్లేవు ( నూగుల్లో సగం వేసుకోవచ్చు. కానీ ఇంకొంచెం ఎక్కువ పడితే బాగుంటుంది.)
తురుము/ముక్కలు ఏదైనా. అంగట్లో తురిమి పెట్టినది మాత్రం కొనవద్దు. ఏం బాగుండదు.
బెల్లము - మెత్తగా దంచినది
అంతే!!!!!!!!!!!!!
ఇప్పుడు మిక్సీలో నూగుల్ని ముందుగా తిప్పేసి తరువాత కొబ్బెర, బెల్లపు పొడి వేసుకుని తిప్పాలి.
అప్పట్లో రోట్లో దంచేవారట. ఎత్తుటి రోళ్ళు ఉంటాయి. మనిషికి నడుము వరకూ వచ్చేవి. నిలబడి దంచేవారుట. కేజీలకు కేజీలు.
కానీ చిన్నప్పుడు నల్లటి ఉంటలను చూస్తే తినబుద్ది అయేది కాదు. ప్రసాదం మాత్రం తీసుకునేదాన్ని.
తర్వాత ఇష్టం కలిగింది. ఎప్పుడైనా గుర్తొస్తే పండగ కాకపోయినా చేసుకోవటమే.
ఇప్పుడైతే అందరూ చెప్తున్నారు కదా. ఆడవాళ్ళకి నువ్వులు , బెల్లము చాల మంచిదని.
తప్పక ప్రయత్నిస్తారుగా!!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి