కారాలు అంటే కోస్తా వాళ్ళు బహుశా కారప్పూస, జంతికలు అంటారనుకుంటా. మేమంతా కారాలు అని అనేది గొట్టంలో పిండిని పెట్టి నొక్కి రంగవల్లుల్లా అందంగా కనిపిస్తూ ,కరకరలాడుతూ రుచిగా ఉండేవాటిని. వీటిని చేయడానికి చాలా రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పబోయెది బియ్యపిండి, పెసరపప్పు తో చేసేవి. ఒక దీపావళి, కృష్ణాష్టమి వచ్చినా కొత్తల్లుడు ఇంటికొచ్చినా, మనుమలు, మనుమరాళ్ళు అమ్మమ్మ దగ్గర శెలవులకొచ్చినా కారాలు తప్పనిసరి. కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి - బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఆరబోసి,జిన్ను లో పిండి పట్టించాలి. పెసరపప్పు - బియ్యప్పిండి లో నాలుగోవంతు.( తక్కువేస్తే కారాలు మితూగా రావు.అంటే గట్టిగా వస్తాయి. ఓ పిడికెడు ఎక్కువేస్తేనే బాగుంటాయి. మరీ ఎక్కువేస్తే నూనె ఎక్కువ పీలుస్తాయి.) ఉప్పు, కారప్పొడి తగినంత. తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పుని ఒక అరగంట నానబోయాలి. తరువాత ఉడికించుకోవాలి. కుక్కర్ అక్ఖర్లేదు. పెసరపప్పు, పైగా నానింది కాబట్టి, పది నిముషాల్లోనే ఉడికిపోతాయి. మెత్తగా ఉడికిన పప్పుని, బియ్యప్పిండి లో వేసి,చేత్తో బాగా కలపాలి. చిదుముతూ కలిపితే గుర్తు తెలీకుండా బాగా కలుస్తుంది. అవసరమైనన్ని నీళ్ళు కలుపుకుని కొద్దికొద్దిగా చక్కగా నాదాలి. చేతిలో పట్టే పిండి తీసుకుని నాదుకుంటే చాలు ఆ పిండిని కారాల చిట్లలో( జంతికల గొట్టం -??) వేసి ఒక ప్లాస్టిక్ పపెర్ మీద కొంచెం జిడ్డు చేసుకుని పిండుకోవాలి. దాన్ని పేపర్ మీద నుంచి అలాగే తీసుకుని బాణట్లో కాగుతున్న నూనెలో వేసి బాగా వెగాక తీయటమే. 1. ఇవి 10,15 రోజుల దాకా ఉంటాయి.
ఇంకో రకం ఉంది. అది మళ్ళీ ఇంకో పోస్ట్ లో చెప్తాను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి