Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఆగస్టు 2010, శనివారం

వంకాయ నించుడుకాయ

వంకాయ నించుడుకాయ

గుత్తి వంకాయ ఒక్కొక్కరూ ఒక్కోలా వండుతారు.
మా ఇంట్లో చేసే పద్ధతి నేను రాస్తాను. (అబ్బే, మేమూ ఇలాగే చేస్తామే అంటారా, సరే కానీండి.)

కావలసిన పదార్థాలు:

లేత వంకాయలు ~~~ కిరీటం తీసేసి + లాగా చీల్చి పెట్టుకోవాలి. (పూర్తిగా విడిపోకుండా)
ఉల్లిగడ్డలు ~~~ పొట్టు తీసి పెద్దపెద్ద ముక్కలు చేసి పెట్టుకోవాలి.
పప్పులు అదే వేయించిన శనగపప్పు అంటారే అదన్నమాట
ఎండుకొబ్బెర ~~~ తురిమి ఉంచుకోవాలి
ఉప్పు , కారంపొడి, నూనె
వంకాయలు ఓ ఎనిమిది ఉంటే ఓ నాలుగు ఉల్లిగడ్డలు, ఓ చిన్ని గిన్నెడు పప్పులు, ఓ చిన్ని ఎండు కొబ్బరి చిప్ప, రెండు పెద్ద చెంచాల కారప్పొడి, అంతే ఉప్పు , రెండు పెద్ద గరిటెల నూనె పడుతుంది.
ఇదంతా నేను అందాజుగా చెప్పిన కొలతలు. కొంచెం పప్పులు, కొబ్బెర, ఉల్లిగడ్డలు ఎక్కువేసుకున్నా రుచి బాగుంటుంది. తక్కువేసినా పరవాలేదు.

ఇక చేసే పద్ధతి:

* ముందుగా పప్పులు, తురిమిన కొబ్బెర, ఉప్పు, కారం పొడి చేసుకోవాలి.
* ఆ పొడిలో ఉల్లిగడ్డ ముక్కలు వేసి మళ్ళీ మిక్సీలో వేయాలి.
* ఇప్పుడు ఉల్లిగడ్డముక్కలు, పొడి అంతా కలిసి తడిపొడి గా ఉంటుంది.
* అదంతా ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ఒక పెద్ద గరిటెడు నూనె పోసి, (ముద్దగా కాకూడదు కానీ మరీ పొడిగా కూడా ఉండకూడదు.) కలిపి పెట్టికోవాలి.
* ఇప్పుడు చీల్చి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకుని, ఆ వంకాయ లోపల నూనె కలిపిన పొడిని కూరుకోవాలి.
* అన్ని వంకాయలూ అయిపోయాక పొడి మిగిలితే మంచిది. కూర పైన చల్లుకోవడానికి.
* ఇంక పొయ్యి మీద ఒక మందమైన బాణలి పెట్టాలి.
* బాణలి వేడెక్కక మునుపే పొడి కూరిన వంకాయలన్నీ వరసగా బాణట్లో పేర్చుకోవాలి.
* బాణలి మీద మూత పెట్టి, పొయ్యి వేడి తక్కువలో పెట్టాలి.
* మధ్యలో అప్పుడప్పుడూ జాగ్రత్తగా వంకాయల్ని(కాయ చిదమకుండా)
కదుపుతూ ఉండాలి. ( అలవాటైన వాళ్ళైతే మూత తీయకుండా పట్టకారుతో జాగ్రత్తగా బాణలినే కొంచెం కుదిపి పెట్టుకోవచ్చు. కాయ చిదమకుండా బాగుంటుంది.
* అవసరమనిపిస్తే కొంచెం నూనె వేసుకోవచ్చు.
* ఒక పది, పదిహైదు నిముషాల్లో వంకాయ ఉడికి ఉంటుంది.
* పైపైన ఆ మిగిలిన పొడి చల్లుకుంటే బాగుంటుంది.
* వెంటనే కదిలించకండి. కొంతసేపయినాక జాగ్రత్తగా కలిపి పెట్టుకోవాలి.
మంచి వాసనతో రుచికరమైన వంకాయ నించుడుకాయ తయారు.

గమనిక: * దీనిని అన్నంతోనూ, చపాతీ తోనూ, జొన్నరొట్టె తోనూ తినొచ్చు. జొన్న రొట్టె తో అయితే స్వ ర్గమే కనిపించేస్తుందనుకోండి. నాదీ హామీ.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు